ఆండ్రాయిడ్ కొత్త వెర్షను లాలిపప్ తెలుగుతో విడుదలైంది

ప్రపంచంలో ఎక్కువగా వాడబడుతున్న ఆపరేటింగ్ సిస్టం ఆండ్రాయిడ్ యొక్క కిట్‌కాట్ (4.4) తరువాతి వెర్షను లాలిపప్ (5.0) విడుదలైనట్లు గూగుల్ ఇప్పుడే ప్రకటించింది. ఈ విడుదలలో ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టంలో పలు మార్పులు చోటుచేసుకున్నాయి. వాటిలో ముఖ్యమైనది ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టంను ఇప్పుడు మనం తెలుగులో కూడా వాడుకోవచ్చు.

ఆండ్రాయిడ్ 5.0 లాలిపప్ విశిష్టతలు:

  •  మెటీరియల్ డిజైన్ అను సరికొత్త యూజర్ ఇంటర్‌పేజ్‌తో మరింత ఆకర్షణీయంగా, సులభంగా మరియు వేగంగా.
  • సరికొత్త నోటిఫికేషన్ సిస్టంతో తెర తాళం వేసి ఉన్నపుడు కూడా సందేశాలను చూసుకోవచ్చు సమాధానమివ్వవచ్చు.
  • యాప్ నోటిఫికేషన్‌లకి మనం ప్రాధాన్యతని ఇచ్చుకోవచ్చు లేదా పూర్తిగా ఆపివేయవచ్చు.
  • వేరే ఆప్లికేషనులో మనం పనిచేసుకుంటున్నపుడు ఫోన్ వస్తే మనం ఆ యాప్ కొనసాగించాలా లేదా ఫోన్‌కి సమాధానంఇవ్వాలా అన్నదాన్ని ఎంచుకునే వెసులుబాటు.
  • మెరుగుపరచబడిన బ్యాటరీ సేవింగ్ మోడ్.        
  • ఎంతసేపట్లో చార్జింగ్ పూర్తి అవుతుందో, ఎంతసేపు బార్జింగ్ వస్తుందో అంచనా సమయాన్ని తెలియజేయడం.
  • అప్రమేయంగా వాడుకరి సమాచారం ఎన్‌క్రిప్ట్ చేయబడడం, మాల్‌వేర్ వంటి ఆపదలనుండి మెరుగైన రక్షణ.
  • సులభంగా సెట్టింగులను మార్చుకోవడానికి వీలుగా క్విక్ సెట్టింగ్ పానల్.
  • తక్కువ బ్యాటరి శక్తిని వాడుకోనె బ్లూటూత్
  • మెరుగైన నెట్‌వర్క్ అనుసంధానం.
  • 64 బిట్ ప్రాససర్లకు, అప్లికేషన్‌లకు మద్దతు.
  • మృధువైన, వేగవంతమైన పనితీరు.
  • మెరుగైన వీడియో, ఆడియో మరియు కేమేరాల పనితీరు.
  • మెరుగైన ఒకే గూగుల్ పనితీరు, తెర ఆపి ఉన్నపుడు కూడా ఒకే గూగుల్ పనిచేయడం.
  • తెలుగుతో పాటు 68 భాషలలో ఆండ్రాయిడ్‌ని వాడుకోగలగడం.
            మరిన్ని విశిష్టతల గురించి లాలిపప్ అధికార సైటును ఇక్కడ చూడండి.